Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మాయి నచ్చింది... అందుకే ఆలా చేశా... ఓ ఇన్విజిలేటర్ కండకావరం!

  • తిమ్మాపూర్ లో ఘటన 
  • బీటెక్ సప్లిమెంటరీ రాసేందుకు వచ్చిన యువతి
  • ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ వేధింపులు
బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని తనకు నచ్చిందని, అందుకే ఆమె ఫోన్ నంబర్ కావాలని బలవంతం చేశానని ఇన్విజిలేటర్ తనలోని కండకావరాన్ని ప్రదర్శించగా, స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన తిమ్మాపూర్ లో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం, ఇక్కడి ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి, సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు మరో ఇంజినీరింగ్‌ కాలేజీకి వెళ్లింది. అక్కడ ఆమె పరీక్ష రాసే గదిలో ఇన్విజిలేటర్‌ గా బట్టు వెంకటేశ్‌ అనే వ్యక్తి వచ్చాడు. ఎగ్జామ్ హాల్ లోకి వచ్చినప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. సెల్ ఫోన్ నెంబరు ఇవ్వాలని వేధించాడు.

అప్పుడే ఎదురుతిరిగి నాలుగు వాయిద్దామని ఆ విద్యార్థిని ఆలోచించినా, తన పరీక్షకు ఆటంకం కలుగుతుందని మిన్నకుండిపోయింది. ఎగ్జామ్ అనంతరం తాను చదివే కాలేజికి వెళ్లి, వెంకటేశ్ ప్రవర్తనపై ప్రిన్సిపాల్‌ కు ఫిర్యాదు చేసింది. దీంతో కాలేజ్ సిబ్బంది, వెంకటేశ్‌ ను పిలిపించారు. ఎందుకలా చేశావని అడిగితే, తనకు ఆ అమ్మాయి నచ్చిందని, అందుకే ఫోన్ నంబర్ అడిగానని చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు అతన్ని చితక్కొట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్‌ ను అదుపులోకి తీసుకున్నారు.
Timmapur
College
Invigilator

More Telugu News